పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్‌కు పవన్ కళ్యాణ్ సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీలను త్వరలో వెల్లడిస్తామని జనసేన పార్టీ ప్రకటించిది.
పర్యటన వాయిదా పడటంతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపడతారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం భీమవరం వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో వెళ్లేందుకు జనసేన నేతలు సైతం ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని విధంగా.. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేనాని భీమవరం పర్యటన వాయిదా పడింది. భీమవరం విష్ణు కాలేజీలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు విద్యుత్, రోడ్డు భవనాల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు.
దీనిపై జనసేన నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్‌కై కలెక్టర్, పోలీసులకు దరఖాస్తు చేసినట్లు జనసేన నేతలు చెప్తున్నారు. కలెక్టర్, పోలీసు శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందనీ.. అయితే విద్యుత్, ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు. కారణాల ఏవైనా పవన్ పర్యటన మాత్రం వాయిదా పడింది.