వీటిని స్వయం ఇక్కడి అభ్యర్థిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారు. ''ఇక్కడ నేనే అభ్యర్థిని. చంద్రబాబు నాకు ఎప్పుడో మాటిచ్చారు. నువ్వే పోటీ చేస్తున్నావ్. అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నాపై కుట్ర రాజకీయాలకు తెరదీసింది. అందుకే.. అభ్యర్థిని మారుస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీనిని ఎవరూ నమ్మొద్దు''- ఇదీ నూజివీడు నియోజకవర్గంలోని బస్టాండు, రైల్వేస్టేషన్, టీకొట్లు, హోటళ్ల ముందు వెలిసిన పెద్ద పెద్ద బ్యానర్లు. వీటిని స్వయం ఇక్కడి అభ్యర్థిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారు.
ఈ పరిణామంతో నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య చర్చ మరింత పెరిగింది. ఒకవైపు.. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని పార్టీలోకి తీసుకుని.. నూజివీడు టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తు న్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ముద్దరబోయిన ఇలా ఫ్లెక్సీ పాలిటిక్స్‌కు తెరదీశారనే చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఆయన మీడియా ముందుకు కూడా వచ్చారు. వైసీపీ కుట్ర చేస్తోందని.. తనపై విష ప్రచారం చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నానని ఆయన చెప్పారు.
అంతేకాదు.. నూజివీడులో గెలిచి.. చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తున్నానని ముద్దరబోయిన వ్యాఖ్యానించారు. దీనికితోడు.. ఆయన అలా చెప్పిన రెండు మూడు గంటల్లోనే ఇలా ఫ్లెక్సీలు వెలవడంతో రాజకీయంగా ఈ విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి గత నాలుగు సంవత్సరాలుగా ముద్దరబోయిన పనిచేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఆయన గెలుపు విషయంపై మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ పై ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో వైసీపీకి చెక్ పెట్టాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది. నూజివీడు, గుడివాడ నియోజకవర్గా లను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లడంతోపాటు గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. కానీ, క్షేత్రస్తాయిలో ఆశలు పెట్టుకున్న ముద్దరబోయిన.. రుస రుస లాడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ ఆయన బుజ్జగిస్తారో.. లేక టికెట్టే ఇస్తారో వేచి చూడాలి.