చెల్లుతుందా చెల్లెమ్మా...!?


 ఆనాడు తెలంగాణాలో పార్టీ పెట్టి జనంలో తిరుగుతున్నపుడు నేను ఆడ పిల్లను అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు వైఎస్ షర్మిల. ఆడపిల్ల పుట్టగానే ఈడ పిల్ల అనరు ఆడపిల్ల అని ఎందుకు అంటారు అని ఒక ప్రముఖ టీవీ చానల్ డిబేట్ లో ఆమె యంకర్ నే ఎదురు ప్రశ్నించారు. తాను తెలంగాణా కోడలుని అని తనకు పార్టీ పెట్టి జనంలోకి పోవడానికి సర్వహక్కులూ ఉన్నాయని కూడా చెప్పారు. ఆమె ఈ సందర్భంగా మరో ఉదాహరణను కూడా తెర ముందుకు తెచ్చారు. సోనియా గాంధీ ఎక్కడో ఇటలీ నుంచి వచ్చారు. ఆమెను భారతీయ నాయకురాలిగా గుర్తిస్తున్నపుడు తనను ఎందుకు గుర్తించరు అని నాడు కాంగ్రెస్ నేతలనూ ప్రశ్నించారు. ఇదంతా గతం అని ఆమె అనుకుంటున్నారు. కానీ యూ ట్యూబులలో సామాజిక మాధ్యమాలలో అలాగే పదిలంగా ఉంది. 


సీన్ కట్ చేస్తే ఆమె ఖద్దరు పార్టీలో చేరిపోయారు. సోనియా గాంధీ దేవత అంటున్నారు. తాను ఈడ బిడ్డనే అంటున్నారు. కడప నా పుట్టిల్లు. నేను జమ్మలమడుపు ఆసుపత్రిలో పుట్టాను అని చెబుతున్నారు. కడప కాంగ్రెస్ పార్టీ సమావేశంలో షర్మిల చేసిన ప్రసంగం పూర్తి ఆవేశపూరితంగా ఉంది. తాను రాజశేఖరరెడ్డి బిడ్డను నా రక్తం వైఎస్సార్ ది నా పేరు వైఎస్ షర్మిలారెడ్డి అని ఆమె పదే పదే చెప్పుకున్నారు. నిజమే ఇది ఎవరు కాన్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆమె గతంలో చేసిన కామెంట్స్ ఇపుడు ఆమెకు ఇబ్బందిగా మారాయి. రాజకీయాలలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవడం వల్లనే ఈ చిక్కులు వచ్చాయి. 


తెలంగాణా విషయంలో ఆమె మాట్లాడుతూ నీటి హక్కులలో ఒక్క చుక్క కూడా ఏపీకి రాకూడదు అన్నారు. తెలంగాణా పక్షాన తాను పోరాడుతాను అన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించారు. నిజంగా షర్మిలకు రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు సరిగ్గా ఉండి ఉంటే ఆమె ఈ మాటలు నాడు ఎందుకు అనాలన్నదే కదా అందరి ప్రశ్న. ఆమె అక్కడ ఆ మాటలు అని ఇపుడు తాను ఆంధ్రుల పక్షం అంటే ఎలా అనే అంటున్నారు. కాసేపు వైసీపీ వారిని పక్కన పెట్టి చూసినా షర్మిల ఏపీకి వచ్చి ఆంధ్రుల హక్కు విషయంలో తాను పోరాడుతాను అని చెబితే నమ్మే వారు ఉంటారా అన్నదే ప్రశ్న. ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో వస్తున్న వేళ ఆమె వచ్చి ఆంధ్రుల హక్కులు అంటూంటే ఆమె అయిదేళ్ళుగా చేసిన పోరాటాలు ఏమిటి అన్న ప్రశ్నలు సగటు జనాలు అయినా వేయరా అన్నది ఆలోచించాలి కదా. 


ఏది ఏమైనా షర్మిల ఆవేశపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ రోజు ఆమె అన్న మాటలూ కూడా పదిలంగానే ఉంటాయి. ఆమె రెండు నెలల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా కొన్ని సీట్లు అయినా గెలిపించాలని అనుకుంటున్నారు. ఒక వేళ అది సాధ్యపడకపోతే ఇదే కాంగ్రెస్ ఆమెకు ఈ పీసీసీ పదవిలో ఎన్నాళ్ళు కూర్చోనిస్తుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకులకు వారి మాటలే మరో సందర్భంలో ఇబ్బందిపెడతాయి అనడానికి షర్మిల ఉదంతమే ఉదాహరణ అని మేధావులు అంటున్నారు.

Previous Post Next Post