తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోసారి అధికారం దక్కించుకుని దక్షిణాదిలో ఒక ప్రాంతీయ పార్టీ వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన ఘనతను సొంతం చేసుకోవాలని.. భావించిన బీఆర్ఎస్‌కు ప్రజలు మొగ్గు చూపలేదు. దీంతో 34 స్తానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది. అయితే.. మరో రెండు మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చారు. తమకు పార్లమెంటు ఎన్నికలలో ఎందుకు ఓటేయాలో ఆయన సెలవిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు దూరం పెట్టారో తెలియలేదన్న కేటీఆర్.. తామే తెలంగాణకు బ్రాండ్స్ అన్నట్టుగా మాట్లాడారు. తెలంగాణ గొంతు వినిపించేది.. తామే నని చెప్పుకొచ్చారు. నాడైనా నేడైనా తెలంగాణ ప్రజల గురించి తామే గళం విప్పుతున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
పార్లమెంటులో తెలంగాణ తరఫున బీఆర్ ఎస్ ఎంపీలు మాత్రమే స్పందించేవారని.. వారు మాత్రమే సమస్యలపై ప్రశ్నలు అడిగేవారని.. కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రశ్నల వివరాలను కూడా ఆయన లెక్క చూపించారు. కాబట్టి.. తెలంగాణ తరఫున గళం వినిపించేది తామేనని అన్నారు. 2024లో ఏర్పడే 18వ లోక్‌సభలోనూ తెలంగాణ నుంచి తామే మాట్లాడతామని.. కాబట్టి తమకే ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఎన్ని ప్రశ్నించారనేది ముఖ్యమా.. ? ఎన్ని పనులు సాధించారనేది ముఖ్యమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. విభజనకు సంబంధించిన ఒక్క హామీని కూడా ఇప్పటికీ సాధించలేక పోయారు. కాళేశ్వరానికి జాతీయ హోదాపై 100 ప్రశ్నలు సంధించారు. కానీ, సాధించలేదు. నీటి వివాదం విషయంపై అనేక సందర్భాల్లో పార్లమెంటులో నిలదీసినంత పనిచేశారు. కానీ, ఒరిగింది ఏమీలేదు. సో.. ప్రశ్నించడం కాదు.. పని చేసింది ఎంత? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.