ఇక జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా తెలంగాణాలో తేల్చుకోవాలని చూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే సౌత్ ఇండియా చాలా కీలకంగా రెండు పార్టీలకు మారుతోంది. కాంగ్రెస్ కి ఉత్తరాదిన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక బీజేపీకి దక్షిణ భారత దేశంలో అవకాశాలు అందుకోవాలని ఉంది. దాంతో ఈసారి దక్షిణ భారత దేశంలో ఎంపీ సీట్లు ఎక్కువగా పెంచుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి. ఇక ఆయా పార్టీలకు చెందిన అధినేతలు కూడా సౌత్ నుంచి పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నారు.
బీజేపీకి అయితే గత ఏడాది ఆశలు పెట్టుకున్న కర్నాటక తెలంగాణా రాష్ట్రాలు రెండూ పోయాయి. కర్నాటకలో ఉన్న అధికారం సైతం పోగొట్టుకున్న బీజేపీ తెలంగాణాలో డబుల్ డిజిట్ అని పెట్టుకున్న ఊహలు కూడా తల్లకిందులు అయ్యాయి. అయితే కర్నాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని అక్కడ ఎక్కువగా ఎంపీ సీట్లు సాధించాలని చూస్తోంది. అలాగే ఏపీలో టీడీపీ కూటమితో వెళ్లే అవకాశాలు పరిశీలిస్తోంది. కేరళ తమిళనాడులో ఎంతో కొంత ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ జరగాలంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్న ముద్రను తొలగించుకోవాలని బీజేపీ చూస్తోంది. దానిలో భాగంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా నుంచి మల్కజ్ గిరి లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం సాగుతోంది.
మల్కజ్ గిరి లోక్ సభ పరిధిలో అన్ని రాష్ట్రాల వారూ ఉంటారు. అది పెద్ద నియోజకవర్గం, మినీ ఇండియా. అన్ని పార్టీలూ అక్కడ గెలిచాయి. దాంతో పాటు మోడీ కనుక పోటీ చేస్తే కచ్చితంగా ఆ ప్రభావం మిగిలిన సీట్ల మీద కూడా ఉంటుందని ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు తెలంగాణాలో గెలుచుకోవచ్చు అన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది. దాంతో మోడీ తెలంగాణాలో పోటీ అన్నది బీజేపీ నుంచి వస్తున్న ప్రచారంగా ఉంది. ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఖమ్మం నుంచి పోటీకి సోనియా గాంధీ రెడీగా ఉన్నారు అని అంటున్నారు. ఆమెను ఎంపీగా పోటీ చేయిస్తే తెలంగాణాలో అత్యధిక శాతం సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవచ్చు అన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది.
ఖమ్మం ఎందుకంటే అది కాంగ్రెస్ కి కంచుకోటగా ఉంది. దాంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. దాంతో సోనియాగాంధీ వస్తే గెలిపించుకుని తీరుతామని అంటున్నారు. ఇలా అటు మోడీ ఇటు సోనియాగాంధీ ఇద్దరూ కూడా తెలంగాణాలో ఈసారి ఎంపీలుగా పోటీ చేస్తారు అన్న ప్రచారం అయితే గట్టిగా ఉంది. మరి అది ఎంతమేరకు నిజం అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జాతీయ పార్టీలు రెండూ తెలంగాణా మీద పూర్తి ఫోకస్ పెట్టాయన్నది వాస్తవం అని చెప్పాల్సి ఉంది.