ఈనెల 22న ఓటరు తుది జాబితా విడుదల: జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్


 ఏలూరు: జిల్లాలో స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.  

స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ వారి ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 16,24,413 మంది ఓటర్లుగా నమోదైవున్నారన్నారు.  ముసాయిదా ఓటరు జాబితాపై జనవరి 16వ తేదీ వరకు వచ్చిన క్లైయిమ్ లు, అభ్యంతరాలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. 


జిల్లాలో ఇప్పటి వరకు 3,16,259 ధరఖాస్తులు స్వీకరించగా 2,96,833 ధరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు. ఇంకా ఫారం-6 కింద 910, ఫారం-7 కింద 1303, ఫారం-8 కింద 1912 మొత్తం కలిసి 4,125 ధరఖాస్తులు పరిష్కరించవలసియుందన్నారు.  ఓటరు తుది జాబితాను ఈనెల 22వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. ఖచ్చితమైన, దోషరహిత ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో ప్రతి విషయాన్ని రాజకీయ పక్షాల ప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.  


జిల్లాలో స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీలో ఎప్పటికప్పుడు తమతో సమావేశాలు నిర్వహిస్తూ వివరాలు తెలియజేస్తూ, తమ సందేహాలను నివృత్తి చేస్తున్న జిల్లా కలెక్టర్ వారికి వారి యంత్రాంగానికి సమావేశంలో పాల్గొన్న రాజకీయ పక్షాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.  


ఈ సమావేశంలో సిర్రా భరత్(బిఎస్పీ), నెరుసు నెలరాజు(బిజేపి), పి. ఆదిశేషు(సిపిఎం), ఆర్. రామ్మోహన్ రావు(కాంగ్రేస్), పాలి ప్రసాద్(టిడిపి), కలవకొల్లు సాంబ(వైఎస్ఆర్ సిపి), కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్న దొర తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post