వైసీపీలోకి రంగా తనయుడు రీఎంట్రీ!


ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండటం, కాపు సామాజికవర్గం కూటమి వైపు ఉంటుందనే అభిప్రాయాల నేపథ్యంలో అధికార వైసీపీ అప్రమత్తమైంది. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడును వైసీపీ తమ పార్టీలో చేర్చుకుంది. ఆయనకు గుంటూరు లోక్‌ సభ సీటు లేదా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అంబటి రాయుడుతోపాటు ఇంకొంతమంది కీలక కాపు నేతలపై వైసీపీ దృష్టి సారించిందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో దివంగత నేత వంగవీటి మోహన్‌ రంగా తనయుడు వంగవీటి రాధాపై కన్నేసిందని అంటున్నారు. 

ఈ దిశగా ఇప్పటికే వైసీపీ లోక్‌ సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి .. వంగవీటి రాధాను కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెబుతున్నారు. ఆయన చెప్పిన మాటలను సావధానంగా విన్న రాధా ఏ విషయం మిథున్‌ రెడ్డికి చెప్పలేదని టాక్‌ నడుస్తోంది. 2004 ఎన్నికల్లో వంగవీటి రాధా కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో రాధా ప్రముఖ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. విజయవాడ సెంట్రల్‌ నుంచి బరిలోకి దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ చేతిలో ఓడిపోయారు. 

ఇక 2019 ఎన్నికల్లో రాధా విజయవాడ సెంట్రల్‌ సీటు ఆశించారు. అయితే ఆ సీటును వైసీపీ అధినేత జగన్‌.. మల్లాది విష్ణుకు కేటాయించారు. రాధాను విజయవాడ తూర్పు, అవనిగడ్డల్లో ఎక్కడి నుంచైనా లేదా బందరు ఎంపీగా పోటీ చేయాలని కోరారు. అయితే రాధా తనకు విజయవాడ సెంట్రల్‌ మాత్రమే కావాలని అడగడం.. జగన్‌ అందుకు ఒప్పుకోకపోవడంతో రాధా పార్టీ వీడి ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన టీడీపీలో చేరారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు. 

గత ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుడిగా చాన్సు ఇస్తామని ఆ పార్టీ రాధాకు హామీ ఇచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో వంగవీటి రాధా ఏ పదవి లేకుండా మిగిలిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో రాధా ప్రచారం నిర్వహించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ సెంట్రల్‌ లో బొండా ఉమా పోటీ చేసే అవకాశం ఉంది. 2014లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన బొండా ఉమా.. 2019 ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా బొండా ఉమా ఉన్నారు. 2024 ఎన్నికల్లోనూ విజయవాడ సెంట్రల్‌ నుంచి టీడీపీ తరఫున బొండా ఉమా పోటీ చేస్తారని లోకేష్‌ చెప్పినట్టు తెలిసింది. వంగవీటి రాధాకు టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన స్థాయికి తగ్గ కీలక పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.

Previous Post Next Post