2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం.... రూ.25 లక్షల వరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు...


 ఏలూరు/కామవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి జగనన్న ఆరోగ్య సురక్ష కింద వైద్య శిబిరాలు నిర్వహించి, వాటికి కొనసాగింపుగా 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహిస్తునట్లు జెడ్పి సిఇఓ కె. ఎస్.ఎస్. సుబ్బారావు తెలిపారు.  


మంగళవారం కామవరపుకోటలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి రమేష్, ఎంపిపి విజయలక్ష్మీ, గ్రామ సర్పంచ్ అనూష తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో కె. ఎస్.ఎస్. సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ, ఆరోగ్య భరోసా ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే 1వ  విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం కింద జిల్లాలో పెద్దఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వైద్య పరీక్షలు చెయ్యడం తోపాటు ఉచితంగా మందులు కూడా అందచేశామన్నారు. 


వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో ఎక్కువగా సుగర్, బిపి సంబందించిన వారు ఉన్నారని, వారికి సరైన సమయంలో చికిత్స చేసి మందులు వాడటం వల్ల తదుపరి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. ఆ క్రమంలో  2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ద్వారా అనుసంధాన వైద్య సేవలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి ఆరునెలలు ఒకసారి ఆయా గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 


ప్రజా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా నూతన ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అంద చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద గ్రామాల్లో మొబైల్ వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందచేసి, ఆరోగ్య భద్రత కోసం డాక్టర్లు సేవలందించ నున్నట్లు తెలిపారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి వైద్య శిబిరాల వివరాలు ముందస్తుగా తెలియ చేయనున్నట్లు తెలిపారు. 

జిల్లా పంచాయితీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ఆరోగ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యరంగాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ప్రతి మండలంలో వారానికి ఒక క్యాంపు జరుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో మంగళ, శుక్రవారాల్లోను, పట్టణ ప్రాంతాల్లో బుధ, గురు వారాల్లో జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో 92 రకాల మందులను , పట్టణ ప్రాంతాల్లో 187 రకాల మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపుల్లో 14 రకాల పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. నాగేశ్వరరావు, ఎంపిడిఓ కె. శ్రీదేవి, తహశీల్దారు డి. సత్యనారాయణ, డిఎల్ డిఓ రాజు, వైద్యాధికారి టిడిఎల్ బి కుమార్,  సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post