ఏలూరు: తప్పులులేని శుద్ధమైన ఓటరు జాబితా రూపకల్పనకు బిఎల్ఓలు పకడ్బందీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.
By: E city News
స్ధానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ బిఎల్ఓలు, సూపర్ వైజర్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో బిఎల్ఓల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బిఎల్ఓల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నూరుశాతం దోషరహిత ఓటర్ల జాబితా రూపొందించడమే మనముందన్న లక్ష్యమన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల కమీషన్ తీసుకొనే చర్యలకు బాధ్యులమవుతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి పరిశీలనా కార్యక్రమం గడువు పొడిగించినందున బిఎల్ఓలు మరింత శ్రద్ధగా పరిశీలన చేయాలన్నారు. డిశంబరు 26 వరకు వున్న గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. తుది ఓటర్ల జాబితా విడుదల తేదిని జనవరి 5కి బదులుగా జనవరి 22న ఓటర్ల తుదిజాబితా ప్రచురణ ఉంటుందన్నారు. డూప్లికేట్ అయిన, మరణించిన శాశ్వత వలస వెళ్లిన, ఒకే డోర్ నెంబరులో 10 మందికన్నా ఎక్కువ ఓటరులు ఉన్నా ఇటువంటి అంశాలను బాధ్యతగా పరిశీలించాలన్నారు. జంకు క్యారెక్టర్స్, అనామలోస్ వంటివి లేకుండా చూడాలన్నారు.
అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఓటుహక్కు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపు కొరకు అందిన ధరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలన్నారు. విద్యార్ధుల్లో ఎన్నికల హక్కులపై అవగాహన కల్పించడానికి, నమోదు, ఓటింగ్ యొక్క ఎన్నికల ప్రక్రియతో పరిచయం చేయడానికి ఎలక్టోరల్ లిటరసి క్లబ్ ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. జండర్, ఇపి రేషియో ఓటింగ్ శాతం పెంపుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వృద్ధాప్యంలోవున్న సీనియర్ సిటిజన్ల ఇంటి దగ్గరకు వెళ్లి ఓటుతీసుకునే అవకాశాన్ని ఎన్నికల కమీషన్ కల్పిస్తున్నదన్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఇతర నియోజకవర్గాలకన్నా తక్కువగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 67 శాతం మాత్రమే పోలింగ్ నమోదైయిందన్నారు. ఈ దృష్ట్యా రానున్న ఎన్నికల్లో కనీసం 80 శాతం పోలింగ్ జరిగేలా ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు. ఏ ప్రాంతంనుంచి తక్కువ మంది ఓటింగ్ లో పాల్గొన్నారో గుర్తించి ఓటర్లలో ఎన్నికల భాగస్వామ్య సంస్కృతిని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్బంగా ఓటింగ్ యంత్రాల పనితీరుపై డెమో నిర్వహించారు.
ఈ సమావేశంలో 65 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్ఓ, జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, అధనపు ఈఆర్ఓలు, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, ఏలూరు తహశీల్దారు బి. సోమశేఖర్, ఏఇఆర్ఓ ఎల్. విద్యాసాగర్, ఎంపిడిఓ ప్రణవి తదితరులు పాల్గొన్నారు.