ఏలూరు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో నర్సింగ్ కెపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో భాగంగా ఆసుపత్రి వెలుపల ప్రాంతాన్ని, క్యాజువాలిటీ వార్డులో రోగులకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంత మంది వైద్య సిబ్బంది ఉన్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 8 పడకలతో కూడిన అత్యాధునిక ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ఎమర్జెన్సీ వార్డును ఆధునికరిస్తామని, కొత్త బెడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తొలుత క్యాజువాలిటీ వార్డు, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి ఇంకా ఏమి చర్యలు తీసుకోవాలో డ్యూటీలో ఉన్న డాక్టర్లను ఆరా తీశారు. ఈ సందర్భంగా డ్యూటి డాక్టర్ మొబినా మాట్లాడుతూ క్యాజువాలిటీ వార్డులో ఆక్సిజన్, మానిటర్ తో కలిగిన మూడు బెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పలు వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను కలెక్టర్ ఆరా తీశారు. డాక్టర్లు వచ్చి చూస్తున్నారా, ఏ సమయానికి వస్తున్నారు అని ప్రశ్నించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు .
అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆసుపత్రి పరిశీలించిన పిమ్మట కొన్ని అభివృద్ధి చేయవలసిన అంశాలు, కావలసిన అవసరాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆ మేరకు కొత్త బెడ్లు ఏర్పాటులకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని బెడ్ల అవసరతను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళామని, సంబంధిత శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉండేలా చూడటంతో పాటు ముఖ్యంగా బాత్రూములు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కోవిడ్ పై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లాలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎక్కువ బెడ్లతో కూడిన ప్రత్యేక వార్డును కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ కేసులు పెరుగుతున్నాయని భావిస్తే అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అయితే ప్రజలు కూడా తరచూ చేతులను శుభ్రపరచుకోవడం, జన సందోహంలోకి వెళ్లే సమయంలో మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించడం, శానిటేషన్ చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ విషయంపై ఎక్కువగా ప్రజలకు అవగాహన పరచవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పాల్ సతీష్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.