By: E city News
బుధవారం స్థానిక ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి అధ్యక్షతన 26వ బ్యాచ్ రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థినుల క్యాప్ ప్రధానోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వె. ప్రసన్న వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్ విద్య పూర్తి చేసుకుని రోగులకు సేవలు అందించేందుకు తొలి అడుగులు వేస్తున్న విద్యార్థులు చాలా బాధ్యతగా అందరికీ సమానత్వంతో సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మంచిగా సానుకూలంగా మాట్లాడి వారిలో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాలన్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గడం వృద్ధులపట్ల గౌరవం తగ్గటం ఉన్న పరిస్థితుల్లో వృద్ధులపై ప్రేమ కరుణ చూపి మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోగులకు సేవలు అందించడంలో నర్సులు కీలక పాత్ర వహిస్తారన్నారు.
ఈ వృత్తికి వన్నెతెచ్చినటువంటి ఫ్లోరెన్స్ నైటైంగిల్ ను ఆదర్శంగా తీసుకొని శిక్షణ అనంతరం విద్యార్థినులు సేవా భావంతో పని చేయాలన్నారు. కోవిడ్ సమయంలో నర్సులు రోగులకు అందించిన సేవలు మరువలేమన్నారు. కొవ్వొత్తులను వెలిగించి ప్రతిజ్ఞ చేయించడం గురించి మాట్లాడుతూ కొవ్వొత్తు కరిగి ఇతరులకు వెలుగు నింపుతుందని అదేవిధంగా నర్సులు చేస్తున్న సేవలు స్ఫూర్తినిస్తాయన్నారు. ప్రతి వ్యక్తి సేవలు అందించడంలో సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే వారు చేసే సేవలో ఆనందం ఉంటుందన్నారు. నర్సింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థినుల ఉద్యోగాలు పొంది ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీలో డయాలసిస్ సెంటర్ కు డయాలసిస్ వైద్య పరికరాలను అందజేసిన దాతలను కలెక్టర్ అభినందించారు. అనంతరం శిక్షణ పొందిన నర్సులకు క్యాపులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు నర్సింగ్ వృత్తికి వన్నెతెచ్చిన ఫ్లోరెన్స్ నైట్యాంగిల్ రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాoట్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు. అలాగే రెడ్ క్రాస్ భవనంలో డయాలసిస్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. తొలుత రెడ్ క్రాస్ డయాలసిస్ సెంటర్ ను రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన లిఫ్టును, మినరల్ వాటర్ ప్లాంట్ ను, విస్తరించిన రెడ్ క్రాస్ మెడికల్ స్టోర్ ను, డ్రింకింగ్ మినరల్ వాటర్ సర్వీసును కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డయాలసిస్ వైద్య పరికరాలను విరాళంగా అందించిన వి.వి. హనుమంతరావు, వి. సుబ్బలక్ష్మి దంపతులను, కాకరాల రాజా, అమ్మాజీ లను కలెక్టర్ సత్కరించారు. రెడ్ క్రాస్ ద్వారా సేవలందిస్తున్న వి.చిట్టిబాబు, మానవత ఏ.నాగేశ్వరరావు, ఆరోగ్యశ్రీ వైద్యాధికారి డాక్టర్ జె. వి. ప్రసాద్ రెడ్డి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఎం. ఝాన్సీ రాణి, డిసిహెచ్ పాల్ సతీష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలను శాలువులతో సత్కరించి మెమెంటోలను అందజేశారు. అదేవిధంగా శివశంకర ప్రసాద్, గురిజాడ శ్రీకాంత్, వి.చిరంజీవి రావు, బి. నారాయణరావు, డాక్టర్ గురజాడ నవ్య, టి. రామారావు, పద్మజావాణి, వై. ఉమావాణి, ఆర్. కమల, పాలడుగుల వెంకటేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కే. కృష్ణారావు, కూచిపూడి ఫణి కుమార్, గోసపాటి సత్యనారాయణ తదితరులకు మెమెంటోలు అందజేశారు.