రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
ధాన్యం సేకరణలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్
ఏలూరు: ప్రస్తుత ఖరీఫ్ లో ధాన్యం సేకరణలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ లో 5. 77 లక్షల మెట్రిక్ ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామని, అందుకు తగిన విధంగా ఎటువంటి సమస్యలు లేకుండా ధాన్యం సేకరణకు అధికారులందరూ పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు.
ధాన్యం పండించిన రైతుకు ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ చేయాలన్నారు. జిల్లాలో గత మూడు వ్యవసాయ సీజన్ల నుండి ఆన్లైన్ విధానం ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, గతంలో ఎదుర్కొన్న సమస్యలు మరల పునరావృతం కాకుండా ధాన్యం సేకరణలో ప్రధాన సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని, కంట్రోల్ రూమ్ కు వచ్చే ప్రతీ సమస్యకు వెంటనే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్ ను జిల్లాలోని ప్రతీ రైతు భరోసా కేంద్రంలోనూ ప్రదర్శించాలన్నారు.
ధాన్యం సేకరణ ప్రక్రియ, తేమశాతం, నూకల శాతం కొలతల విధానాన్ని రైతు భరోసా కేంద్ర పరిధిలోని ప్రతీ రైతుకు తెలిసే విధంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు నుండి ధాన్యం సేకరించిన తరువాత ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతుల రైస్ మిల్లర్ల నుండి రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా కస్టోడియన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
గోనెసంచుల కొరత రాకుండా, ధాన్యం రవాణాకు వాహనాలు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ధాన్యం రవాణాకు 3 వేల వాహనాల వరకు అవసరం అవుతాయని అంచనా వేశామని, అందుకు తగిన విధంగా జి.పీ.ఎస్. ట్రాకింగ్ విధానం కలిగిన వాహనాలు సిద్ధం చేసేలా జిల్లాలోని లారీ ఓనర్స్ అసోసియేషన్స్ వారితో సమన్వయము చేసుకోవాలని ఉప రవాణా కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ధాన్యం సేకరణకు 50 లక్షల గొనె సంచులు అందుబాటులో ఉన్నాయని, వాటిని రొటేషన్ విధానంలో వినియోగించాలన్నారు. ధాన్యం సేకరణ ప్రారంభించిన మొదటి నెల నుండి 45 రోజుల వరకు సేకరణ వేగంగా ఉంటుందని, అటువంటి సమయంలో ధాన్యమును రైస్ మిల్లుల వద్ద వేగవంతంగా దిగుమతి ప్రక్రియ చేపట్టాలన్నారు.
జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం రవాణాకు లారీలతో పాటు, ఇరుకు రోడ్లు ఉన్న గ్రామాలలో వినియోగించేందుకుగాను ట్రాక్టర్ లను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ధాన్యంలో తేమశాతం, నూకల శాతం కొలిచేందుకు సంబంధిత సిబ్బందికి శిక్షణ అందించడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణలో కస్టోడియన్ అధికారులు పాత్ర ప్రముఖమైనదని, వారి సేవలు సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం సేకరణకు వినియోగించే రవాణా వాహనాలకు తప్పనిసరిగా జి,పీ.ఎస్. ట్రాకింగ్ విధానం కలిగిన వాహనాలను వినియోగిస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్రన్, జిల్లా పరిషత్ సీఈఓ కె. రవికుమార్, డి.ఆర్.డి.ఏ పీడీ కె. విజయరాజు, ఉప రవాణా కమీషనర్ ఎస్. శాంతకుమారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి వై. రామకృష్ణ, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజూ భార్గవి , డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్.ఎస్. రాజు, సహకార శాఖ అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ చౌదరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags
ELURU District