వేగవంతంగా ప్రాధాన్యత భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలి: జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్


 సెప్టెంబరు 15 నాటికి పనులు పూర్తికావాలి

 గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించండి


ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో సెప్టెంబరు నెల 15 నాటికి ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ప్రయారిటీ భవనాల నిర్మాణాలు, గృహనిర్మాణం, రీ సర్వే అంశాలమీద మండల స్ధాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి కూడా పాల్గొన్నారు.   


ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాధాన్యత భవనాలను యుద్ధప్రాతిపధికన పూర్తిచేసేందుకు చిత్తశుధ్దితో నిరంతరం కృషిచేయాలన్నారు. వీటి నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్.హెల్త్ క్లీనిక్ లు, భవన నిర్మాణాలు సెప్టెంబరు 15వ తేదీకి పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన లక్ష్యం మేరకు  భవనాలు పూర్తికాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం మొదలైన కారణంగా పనులపై దృష్టిపెట్టి ప్రభుత్వం నిర్ధేశించిన కాలానికి పూర్తి చేయవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. 


ఆగష్టు మాసంలో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయకపోతే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. అసిస్టెంట్ ఇంజనీర్లు ప్రతిరోజు క్షేత్రస్ధాయిలో పర్యటించి రోజువారీ ఫొటోలతో సహా సాయంత్రానికల్లా ప్రగతి నివేదిక అందజేయాలన్నారు. ఈ పనుల నిర్వహణపై ఎఇలు, లక్ష్యాలను పూర్తిచేయడానికి మోనాటరింగ్ చేసి సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఉపాధిహామీ పధకం కింద పంచాయితీరాజ్ కు సంబంధించిన కొత్తపనులకు ప్రతిపాధనలు పంపాలని ఆదేశించిన దృష్ట్యా కొత్త పనులను ప్రతిపాధనలు తయారుచేయాలని ఇందుకు స్ధానిక శాసన సభ్యులు, యంపిపిలతో సంప్రదించి పనులను ప్రతిపాధించాలన్నారు. అనంతరం గృహనిర్మాణం పై సమీక్షిస్తూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల నిర్మాణాలను నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టి పూర్తిఅయ్యేలా చూడాలన్నారు.  


నిత్యం ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో లబ్దిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా స్టేజ్ కన్వర్షన్, బిబిఎల్ స్టేజ్ కన్వర్షన్ గురించి మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. హౌసింగ్ పిడిగా  డిఆర్ డిఏ పిడి ఆర్. విజయరాజుకు ఇంఛార్జి ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా గ్రూపుల్లో మహిళలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ. 35 వేలు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.    


అనంతరం జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి భూ సర్వే ఫేజ్-2 కింద జిల్లాలో 98 గ్రామాలకు సంబంధించిన లక్ష్యాలు, పెండింగ్ పై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఏవో రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Previous Post Next Post